1
1
అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి నిత్య కళ్యాణోత్సవం – భక్తిశ్రద్ధల మధ్య తిరువీధి ఉత్సవం
స్వర్ణగిరి క్షేత్రంలో వేలాది మంది భక్తుల పాల్గొనగ – 5 వేల మందికి నిత్యాన్న ప్రసాదం
రజని వాయిస్ : స్వర్ణగిరి
కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో ఆదివారం నిత్యారాధనలు, నిత్య కళ్యాణ మహోత్సవం, తిరువీధి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు పాల్గొని శ్రీవారిని దర్శించుకుని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.
ప్రాతఃకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించారు. అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుదీరిన గోపృష్ట దర్శనాన్ని భక్తులకు కల్పించారు. ఉదయం 5.45 గంటలకు బంగారు బావి నుంచి సువర్ణ బిందె తీర్థాన్ని వేదమంత్రోచ్ఛారణల నడుమ ఆలయానికి తీసుకువచ్చారు.
ఉదయం 7 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని స్వర్ణాభరణాలు, సుగంధభరిత పుష్పమాలలతో అలంకరించి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం లోకక్షేమం కోసం శ్రీ సుదర్శన నరసింహ హవనాన్ని నిర్వహించారు.
ఉదయం 10.30 గంటలకు వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వేంకటేశ్వర స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కళ్యాణోత్సవాన్ని తిలకించి ఆనందభరితులయ్యారు.
అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా సుమారు 5 వేల మందికి పైగా భక్తులకు నిత్యాన్న ప్రసాదాన్ని అందజేశారు.
సాయంత్రం 6.30 గంటలకు స్వామివారిని మాడవీధుల్లో తిరువీధి ఉత్సవంగా శోభాయాత్ర నిర్వహించారు. గోవింద నామస్మరణలు, మేళతాళాలు, మృదంగ నాదాల మధ్య సాగిన ఈ ఉత్సవంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
తిరువీధి ఉత్సవం అనంతరం సహస్రదీపాల కాంతుల మధ్య ఊయల సేవలో ఆసీనులైన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో అర్చించి కర్పూర మంగళహారతి సమర్పించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.