1
1
రజని వాయిస్ : రంగారెడ్డి బ్యూరో………
మంచి సమాజ నిర్మాణంలో దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలకే పరిమితం కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా మార్గదర్శకాలుగా నిలవాలని ఎంఎంసీ హయత్‌నగర్ సర్కిల్ ఉప కమిషనర్ అజ్మీరా స్వామి అన్నారు. జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో బి.ఎన్.రెడ్డి నగర్‌లోని శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం, పద్మావతి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, ప్రశాంతి నగర్‌లోని శ్రీ షిరిడీ సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్‌లకు పర్యావరణహిత వస్తువులను ఉచితంగా పంపిణీ చేశారు.

జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ కార్యాలయం ఇఇ వెంకట నర్సు ప్రత్యేక చొరవతో, ఆదాని గ్రూప్ ఆర్థిక సహకారంతో ఒక్కో దేవాలయానికి 98 స్టీల్ ప్లేట్లు, 98 స్టీల్ గ్లాసులు, 45 జ్యూట్ బ్యాగులు మరియు మొక్కలు అందజేశారు. ఒక్కో దేవాలయానికి సుమారు రూ.20 వేల విలువైన సామగ్రిని పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా అజ్మీరా స్వామి మాట్లాడుతూ, ప్రజారోగ్యానికి హానికరమైన ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను ప్రభుత్వం నిషేధించిందని గుర్తు చేశారు. నేల కాలుష్యం, పరిసరాల పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పునర్వినియోగ వస్తువులను ఉపయోగించే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. సమాజంలో ప్లాస్టిక్ రహిత జీవన విధానాన్ని ప్రోత్సహించేందుకు జాగృతి అభ్యుదయ సంఘం తీసుకున్న ఆచరణాత్మక చర్యలు ఆదర్శప్రాయమని కొనియాడారు.
దేవాలయాల్లో పాడైపోయిన దేవతా చిత్రాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా శాస్త్రోక్తంగా తొలగించేందుకు “ఉద్వాసన” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఎంఎంసీ ప్రారంభించిందని, ఈ సదుపాయాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

దేవాలయాల ప్రతినిధులు మాట్లాడుతూ, తమ ఆలయాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి స్టీల్ పాత్రల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని, భక్తుల్లో పర్యావరణ చైతన్యం పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. దేవాలయాలు సమాజ సేవా కేంద్రాలుగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో దేవాలయాల ప్రతినిధులు బూడిది వివేకానందరెడ్డి, సి.మంగపతిరావు, ఎం.రాజిరెడ్డి, చంద్రశేఖర్, కుమారస్వామి, నారాయణ, రామకృష్ణ, రవీందర్, రమేష్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. జాగృతి అభ్యుదయ సంఘం ప్రతినిధులు శ్రీరంగనాథ్, యాదా రామలింగేశ్వరరావు, ఇ.శ్రీరాములు గౌడ్, ఎ.సత్యనారాయణ, రఘునాథ్ యాదవ్, గాయకులు కె.వి.రమణయ్య, తాతయ్య, అల్లూరయ్య శెట్టి, ఓబులేష్ యాదవ్, భ్రమరాంబ, రఘురాములు, నాగమణి, రవీందర్, పూజారులు మరియు పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.