1
1
వాగ్దేవి పురస్కారం అందుకున్న పి. పడేసాబ్
కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు చేతుల మీదుగా అవార్డు ప్రదానం
రజని వాయిస్ : న్యూఢిల్లీ బ్యూరో
జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని ఆంధ్ర అసోసియేషన్ భవనంలో నిర్వహించిన తెలుగు వెలుగు వేడుకల్లో తెలుగు భాషా చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పి. పడేసాబ్ వాగ్దేవి పురస్కారం అందుకున్నారు.
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి. నారాయణరెడ్డి జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు భాష, సాహిత్య రంగాలకు విశేష సేవలందిస్తున్న ప్రముఖులకు జాతీయ వాగ్దేవి పురస్కారాలను ప్రదానం చేశారు.
తెలుగు భాష పరిరక్షణ, ప్రచారం, సాహిత్య సేవల్లో పి. పడేసాబ్ చేసిన కృషిని గుర్తిస్తూ ఆయనకు వాగ్దేవి పురస్కారం ప్రకటించారు. ఈ అవార్డును కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు చేతుల మీదుగా పి. పడేసాబ్ స్వీకరించారు.
ఈ సందర్భంగా పి. పడేసాబ్ మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధి, సాహిత్య పరిరక్షణ కోసం తన వంతు కృషి కొనసాగిస్తానని తెలిపారు.
కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు, ప్రముఖులు పాల్గొని పి. పడేసాబ్‌ను అభినందించారు. తెలుగు భాషా సేవలకు గుర్తింపుగా లభించిన ఈ పురస్కారం తెలుగు సమాజానికి గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.
