1
1
హైదరాబాద్, ఆగస్టు 12 :రజని వాయిస్
నకిలీ అగ్నిమాపక ఎన్ఓసీలు (No Objection Certificates) సమర్పించి ప్రభుత్వ అనుమతులు పొందిన జూనియర్ కళాశాలలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ విద్యార్థి యువజన సంఘం మరియు ఎంబీసీ విద్యార్థి యువజన సంఘం సంయుక్తంగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శికి బుధవారం వినతిపత్రం అందజేశాయి.
రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లోని 62కి పైగా ప్రైవేటు జూనియర్ కళాశాలలు నకిలీ ఫైర్ ఎన్ఓసీల ఆధారంగా అనుమతులు పొందినట్లు తమ వద్ద సమాచారం ఉందని సంస్థల రాష్ట్ర అధ్యక్షులు అనంతుల రామ్మూర్తి గౌడ్ మరియు పి. బడే సాబ్ పేర్కొన్నారు.
ఈ అంశంపై సంబంధిత అధికారులతో సమగ్ర దర్యాప్తు నిర్వహించి,నిబంధనలు ఉల్లంఘించిన కళాశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
‘నకిలీ పత్రాల ఆధారంగా అనుమతులు పొందిన కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటేనే విద్యా వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించాలి’ అని వారు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను కోరారు.