1
1
దాశరథి అగ్నిధార.. సినారె అమృతధార: ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
రజని వాయిస్ : హైదరాబాద్ బ్యూరో
తెలంగాణ సాంస్కృతిక శాఖ, తెలుగుభాష చైతన్య సమితి, కుసుమ ధర్మన్న కళాపీఠం, పాలడుగు నాగయ్య కళాపీఠం, నక్క వెంకటమ్మ–నక్క యాదగిరి స్వామి చారిటబుల్ ట్రస్ట్ స్పోర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో మహాకవులు దాశరథి కృష్ణమాచార్యులు, డా. సి. నారాయణరెడ్డి (సినారె) జన్మదినోత్సవాలను సోమవారం హైదరాబాద్లోని రవీంద్రభారతి మినీ హాల్లో ఘనంగా నిర్వహించారు. శ్రీ బడే సాబ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి, శాసనమండలి సభ్యులు శ్రీ దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ దాశరథిని తెలంగాణ ఉద్యమ నిప్పుకనికగా అభివర్ణించారు. ఉపనిషత్తులలోని అగ్నిబీజాన్ని ఆవాహన చేసుకుని “అగ్నిధార” కురిపించిన కవి దాశరథి అని కొనియాడారు. నిజాం పాలనలో నిరాదరణకు గురైన తెలుగు భాషకు ఉద్యమ స్థాయిని తీసుకువచ్చిన శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు ఉద్యమాల వంటి సాంస్కృతిక–సామాజిక ప్రవాహాల నుంచి వెలిసిన అక్షర విప్లవకారుడే దాశరథి అని పేర్కొన్నారు.
పేదలకు అన్నం పెట్టని పంట పొలాలకు అగ్గిపెట్టాలనే ఇక్బాల్ భావజాలం నుంచి స్ఫూర్తి పొంది తెలంగాణ ఉద్యమానికి అక్షరాయుధం అందించిన కవి దాశరథి అని అన్నారు.సినారె గురించి మాట్లాడిన ఆయన అనుప్రాసలు, శబ్దసౌందర్యం, అక్షరరమ్యత, భావగాంభీర్యం, సుదీర్ఘ సమాసాల సృష్టిలో సినారెకు సాటిలేరని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలను గెలుచుకున్న మహాకవి సినారె అని ప్రశంసించారు. దాశరథి, సినారెలు ఇద్దరూ ఇరవై ఐదేళ్ల వయసులోనే కవితా ప్రయాణాన్ని ప్రారంభించి సమాస సంపదతో కవితాంబుధిని నిర్మించిన కలంయోధులని పేర్కొన్నారు.ప్రపంచ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసి రచించిన “ఆధునికాంధ్ర కవిత్వం – సాంప్రదాయాలు, ప్రయోగాలు” అనే సినారె పరిశోధన గ్రంథం ఆయన ప్రతిభ, వ్యుత్పత్తి, సాధనకు నిదర్శనమని దేశపతి శ్రీనివాస్ చెప్పారు. “దాశరథి అగ్నిధార అయితే, సినారె అమృతధార” అని వ్యాఖ్యానిస్తూ, సులభమైన పదాలతో అద్భుత గీతాలను రచించి లక్షలాది సినీప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన చిరస్మరణీయ కవులు వారిద్దరని తెలిపారు.

విశిష్ట అతిథిగా పాల్గొన్న తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీ నామోజు బాలాచారి మాట్లాడుతూ సమగ్ర అధ్యయనం లేకుండా కవిత్వం రాస్తున్న కారణంగా నేటి రచనలు కాలపరీక్షలో నిలవడం లేదన్నారు. కవిత్వం రాయాలనుకునే వారు దాశరథి, సినారేల సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేయాలని, చిరస్థాయిగా నిలిచే సాహిత్యం సాధనతోనే సాధ్యమని సూచించారు.
ఈ కార్యక్రమంలో రామకృష్ణ చంద్రమౌళి, నక్క శ్రీనివాస్ యాదవ్, రాధా కుసుమ, పాలడుగు సరోజినీదేవి, గజవెల్లి సత్యనారాయణ, డా. విజయలక్ష్మి పండిట్, బలసాని వనజ, డా. ఎడ్ల కల్లేశ్, లకుముల జగన్ తదితర కవులు, సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.