1
1
బుక్స్ కొనాలని ఒత్తిడి చేస్తున్నారంటూ తల్లిదండ్రుల ఆందోళన
అడ్మిషన్ రద్దు చేస్తామని హెచ్చరికలు
ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో బుక్స్ విక్రయాలపై వివాదం
హైదరాబాద్, ఆర్కే పురం/కొత్తపేట, రజని వాయిస్
ఆర్కే పురం-కొత్తపేట లోని ఎస్సార్ శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల తల్లిదండ్రులకు పుస్తకాలు కళాశాల నుంచే కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని కొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.పుస్తకాలు తీసుకోకపోతే అడ్మిషన్ రద్దు చేస్తామని హెచ్చరించారని వారు వాపోతున్నారు.
తల్లిదండ్రుల వాదన ప్రకారం, కళాశాల సూచించిన పుస్తకాలను బయట నుంచి కొనుగోలు చేసేందుకు అవకాశం ఇవ్వకుండా, కళాశాల ద్వారానే తీసుకోవాలని చెబుతున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ సంబంధిత విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టాలని కోరుతున్నారు.
అలాగే కళాశాల ప్రాంగణంలోనే అకాడమీ పుస్తకాలతో పాటు ప్రింటెడ్ మెటీరియల్‌ను విక్రయిస్తున్నారని, వాటిని మార్కెట్ ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఇంటర్ విద్యా శాఖ అధికారులు స్పందించి తనిఖీలు నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
కొంతమంది తల్లిదండ్రులు మాట్లాడుతూ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో పుస్తకాల విక్రయంపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ తగిన చర్యలు కనిపించడం లేదని వారు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు నిష్పక్షపాత విచారణ చేపట్టి వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.