1
1
రజని వాయిస్ : హైదరాబాద్ బ్యూరో
న్యూఢిల్లీ ఆంధ్రా అసోసియేషన్ భవనంలో గత నెల 28న జాతీయ తెలుగు సారస్వతా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైభవోపేత కార్యక్రమంలో సేవా రంగంలో విశిష్ట సేవలందిస్తున్న భీమవరం ప్రాంతానికి చెందిన శ్రీ మంగళపల్లి సూర్యనారాయణ మూర్తి, శ్రీ చంద్రభట్ల శ్రీనివాస్ గార్లకు జాతీయ వాగ్దేవి పురస్కారాలు ప్రదానం చేశారు. విద్య, వైద్యం, సంగీతం, భారతీయ సంస్కృతి పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లో వీరు అందిస్తున్న సేవలను గుర్తించి ఈ గౌరవ పురస్కారాలు అందజేశారు.
కార్యక్రమంలో ప్రముఖులు, సాహితీవేత్తలు, సామాజిక సేవకులు పాల్గొని పురస్కార గ్రహీతలను ఘనంగా సత్కరించారు. శాలువాలు కప్పి స్మారక ఫలకాలను అందజేసి అభినందనలు తెలిపారు.

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలికి చెందిన శ్రీ మంగళపల్లి సూర్యనారాయణ మూర్తి గారు గత మూడు దశాబ్దాలుగా నిరంతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారి ఆధ్వర్యంలోని మంగళపల్లి విశాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యా సహాయం, వైద్య సహాయం, ఆర్థిక సాయం, అన్నదానం వంటి అనేక ప్రజాహిత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అంతర్వేది ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం సుమారు వెయ్యి మంది భక్తులకు అన్నదానం నిర్వహించడం, నిరుపేద కుటుంబాలకు నెలనెలా ఆర్థిక సహాయం అందించడం వంటి కార్యక్రమాలు ప్రత్యేక గుర్తింపును సంపాదించాయి.
భీమవరం స్వస్థలంగా కలిగిన శ్రీ చంద్రభట్ల శ్రీనివాస్ గారు విద్య, సంగీతం, భారతీయ సంస్కృతి, గ్రామీణాభివృద్ధి రంగాల్లో గత రెండు దశాబ్దాలుగా విశిష్ట సేవలందిస్తున్నారు. జ్యోతి స్వరూప ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విద్యా సేవలు ప్రారంభించి, అన్నపూర్ణ డిగ్రీ కళాశాల స్థాపనతో గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు కల్పించారు. అలాగే అన్నపూర్ణ మెమోరియల్ మ్యూజికల్ అకాడమీ ద్వారా యువతకు ఉచిత శాస్త్రీయ సంగీత శిక్షణ అందిస్తూ కళా ప్రోత్సాహానికి కృషి చేస్తున్నారు.

భీమవరంలో అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భారతీయ సంస్కృతి పరిరక్షణకు విశేష కృషి చేస్తున్నారని సభలో పలువురు కొనియాడారు. “మానవ సేవే మాధవ సేవ” అనే భావనతో సేవను జీవన విధానంగా స్వీకరించిన ఈ ఇద్దరు సేవామూర్తులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
అదేవిధంగా కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ కాలనాధభట్ల సుధీరమణ సేవలను కూడా సభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 37 సంవత్సరాలు వివిధ హోదాలలో సేవలందించి పదవీ విరమణ అనంతరం ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. రోటరీ క్లబ్, మానవత స్వచ్ఛంద సంస్థలలో సభ్యునిగా, జాతీయ తెలుగు సారస్వతా పరిషత్ కోశాధికారిగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటున్నారు. అవసరమైన వారికి తన వంతు సహాయం అందించడం ద్వారా సేవా తత్వాన్ని ఆచరణలో చూపుతున్నారని నిర్వాహకులు తెలిపారు.

సమాజ సేవకు జీవితాన్ని అంకితం చేసిన మంగళపల్లి సూర్యనారాయణ మూర్తి, చంద్రభట్ల శ్రీనివాస్, డాక్టర్ కాలనాధభట్ల సుధీరమణ వంటి సేవామూర్తులు సమాజంలో సేవా స్పూర్తిని పెంపొందిస్తున్నారని సభలో పాల్గొన్న ప్రముఖులు అభిప్రాయపడ్డారు.