Popular Posts

ఆషాఢపు గోరింటాకు సందడి.. లార్డ్స్ హైస్కూల్లో చిన్నారుల సంబరాలు

ఆషాఢపు గోరింటాకు సందడి.. లార్డ్స్ హైస్కూల్లో చిన్నారుల సంబరాలు

రజని వాయిస్ : రంగారెడ్డి బ్యూరో

ఆషాఢ మాసపు సంప్రదాయ సోయగాలు బి.ఎన్.రెడ్డి నగర్‌లోని లార్డ్స్ హైస్కూల్లో కళకళలాడాయి. పాఠశాలలో నిర్వహించిన గోరింటాకు సంబరాలు చిన్నారుల కేరింతలు, సంప్రదాయ వేడుకల నడుమ అత్యంత వైభవంగా జరిగాయి.ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల లంగావోణీలు, పట్టు దుస్తుల్లో మెరిసిపోతూ చేతుల నిండా గోరింటాకు పెట్టించుకొని ఆషాఢపు ఆనందాన్ని పంచుకున్నారు.

చిన్నారులు వలయాకారంగా కూర్చొని గోరింటాకు చూపిస్తూ సంబరాల్లో మునిగిపోయిన దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజా మండపంలో అమ్మవారిని అలంకరించి దీపారాధన నిర్వహించారు. ఉపాధ్యాయులు చిన్నారులకు గోరింటాకు ప్రాధాన్యత, ఆషాఢ మాస విశిష్టత, తెలంగాణ సాంప్రదాయాల గురించి వివరించారు.

ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలు, పండుగల పట్ల అభిమానం పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీ సిద్ధాల బీరప్ప, వైస్ చైర్మన్ శ్రీ బెర్లు శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ శ్రీమతి సిద్ధాల శ్రీలత, ప్రిన్సిపాల్ శ్రీమతి జ్యోతిర్మయి పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆషాఢ మాస శుభాకాంక్షలు తెలిపారు.

భారతీయ సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడం ప్రతి విద్యాసంస్థ బాధ్యత అని వారు పేర్కొన్నారు.ఉపాధ్యాయులు, సిబ్బంది కూడా సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని గోరింటాకు పెట్టించుకోవడంతో పాఠశాల అంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. చిన్నారుల నవ్వులు, సంప్రదాయ గీతాలు, ఆత్మీయత నడుమ సాగిన ఈ వేడుక బి.ఎన్.రెడ్డి నగర్ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది.