1
1
ఘనంగా చంద్రమౌళి ‘చంద్రికలు’ గ్రంథావిష్కరణ
70వ జన్మదినోత్సవం సందర్భంగా భీమరథ శాంతి మహోత్సవం – సాహితీవేత్తకు ఘన సత్కారం
రజని వాయిస్ : హైదరాబాద్ బ్యూరో
ప్రముఖ సాహితీవేత్త శ్రీ రామకృష్ణ చంద్రమౌళి గారి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణగూడలోని తాజ్ మహల్ హోటల్లో ఆదివారం భీమరథ శాంతి మహోత్సవంతో పాటు “రామకృష్ణ చంద్రమౌళి చంద్రికలు” (కవితలు, కథల సమాహారం) గ్రంథావిష్కరణ సభ ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ చంద్రమౌళి, వారి సతీమణి గిరిజ రాణి దంపతులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

కార్యక్రమానికి బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బస్వరాజ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఎన్. బాలాచారి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ ప్రవచనకారులు బైలూర్ యోగేష్ ప్రభు, దైవాజ్ఞ శర్మ పాల్గొన్నారు. తెలుగు భాష చైతన్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు పీ. బడే సాబ్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
ముఖ్య అతిథి బస్వరాజ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, రామకృష్ణ చంద్రమౌళి నుంచి భవిష్యత్తులో మరిన్ని విలువైన సాహిత్య కృతులు వెలువడాలని ఆకాంక్షించారు.
డాక్టర్ ఎన్. బాలాచారి మాట్లాడుతూ, సరళమైన భాషలో సమాజానికి విలువైన సందేశాలను అందించే రచయితగా చంద్రమౌళి ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు.
బైలూర్ యోగేష్ ప్రభు ఆధ్యాత్మికతతో కూడిన సాహిత్యం సమాజానికి మార్గదర్శకమని పేర్కొనగా, దైవాజ్ఞ శర్మ ఆశీర్వచనాలు అందిస్తూ చంద్రమౌళి మరిన్ని సాహిత్య సృష్టులు చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు, కవులు, సాహిత్యాభిమానులు, కుటుంబ సభ్యులు సింధూర తేజ, శ్రీధర్, నక్షత్ర, త్విష, బాబన్న తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ రామకృష్ణ చంద్రమౌళి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.