Popular Posts

మహాకవి దాశరథి కి ఘన నివాళి

మహాకవి దాశరథి కి ఘన నివాళి

రవీంద్రభారతిలో 101వ జయంతి వేడుకలు – పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు

రజని వాయిస్ : హైదరాబాద్

తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల 101వ జయంతి వేడుకలు రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భాషా–సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని మహాకవి దాశరథి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కవి అందెశ్రీ రచించిన “సాహిత్యం పాటల పూదోట – అందెల సవ్వడి” గ్రంథాన్ని ఆవిష్కరించారు.తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. బాలాచారి సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఆత్మను అక్షరాల్లో ఆవిష్కరించి నిజాం నిరంకుశ పాలనకు కలంతో పోరాడిన మహాకవి దాశరథి సాహిత్యం నేటికీ సమాజానికి మార్గదర్శకమని అన్నారు. “నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అనే దాశరథి నినాదం ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి చిరస్మరణీయ స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నారు. జయంతి సందర్భంగా ప్రముఖ కవులు దాశరథి కవితలను ఆలపిస్తూ అక్షరాంజలి ఘటించారని తెలిపారు.కీలకోపన్యాసం చేసిన ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, దాశరథి జీవితం, సాహిత్యం సమసమాజ నిర్మాణానికి, మానవతా విలువల పరిరక్షణకు అంకితమైందని చెప్పారు. నిజాం నిరంకుశ పాలనకు ధైర్యంగా ఎదురొడ్డిన అక్షర యోధుడు దాశరథి అని కొనియాడారు.దాశరథి కుమార్తె ఇందిరా మాట్లాడుతూ, మహాకవి సాహిత్య వారసత్వాన్ని యువతకు చేరవేయడం నేటి సమాజ బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సభ సమన్వయకర్త బడే సాబ్, ప్రముఖ కవులు అమ్మంగి వేణుగోపాల్, గంటా మనోహర్ రెడ్డి, సంఘనభట్ల నరసయ్య, రామకృష్ణ చంద్రమౌళి తదితరులు పాల్గొని దాశరథి సాహిత్య విశిష్టతను వివరించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కవులు, రచయితలు, సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మహాకవికి ఘనంగా నివాళులర్పించారు.