Popular Posts

స్వర్ణగిరిలో అంగరంగ వైభవంగా నిత్య కల్యాణోత్సవం

భక్తుల గోవింద నామస్మరణల మధ్య తిరువీధి ఉత్సవం – పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన

రజని వాయిస్ : స్వర్ణగిరి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో శ్రావణ మాస శోభ సంతరించుకుంది. శుక్రవారం స్వామివారి ఆలయంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.

ప్రాతఃకాలంలో అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో పాటు ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరిన గోపృష్ట దర్శనాన్ని భక్తులకు కల్పించారు. ఉదయం 5:45 గంటలకు స్వామివారి నిత్యారాధన కోసం బంగారుబావి నుంచి సువర్ణ బిందెతో తీర్థాన్ని వేదమంత్రాల మధ్య తీసుకువచ్చారు.

ఉదయం 7 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలు, పరిమళభరిత పుష్పమాలలతో అలంకరించి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించారు.

శ్రావణ మాసం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి ఉదయం 8 గంటలకు నిత్యార్చనలు పూర్తి చేసిన అనంతరం నవకలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పట్టుచీర, దివ్యాభరణాలు, పుష్పమాలలతో అలంకరించి అష్టలక్ష్మి మండపంలో కొలువుదీర్చారు. అష్టైశ్వర్య ప్రాప్తి కోసం మహాలక్ష్మి హవనం నిర్వహించారు.

వైభవంగా నిత్య కల్యాణోత్సవం

ఉదయం 10:30 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పట్టు పీతాంబరాలు, సుగంధభరిత పుష్పమాలలు అలంకరించి, శ్రీవారి వైభవోత్సవ మండపంలో నిత్య కల్యాణ మహోత్సవాన్ని వేదమంత్రాలు, మంగళధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు.

3 వేల మందికి అన్నప్రసాద వితరణ

స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో ప్రతిరోజూ నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద వితరణలో భాగంగా శుక్రవారం సుమారు 3,000 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.