1
1
మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వ భరోసా
4.21 లక్షల నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా
రజని వాయిస్ : హైదరాబాద్ బ్యూరో
రాష్ట్రంలోని నమోధిత మత్స్యకారుల సామాజిక భద్రతకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా పథకం (GAIS) అమలు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి భద్రత, సామాజిక రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యానికి గురైన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ పథకం కింద 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల నమోదిత మత్స్యకారులు అర్హులవుతారని తెలిపారు.
ఒక్కో లబ్ధిదారునికి బీమా ప్రీమియం రూ.79.96 కాగా, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ప్రీమియాన్ని భరిస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.21.34 కోట్లకు పైగా చెల్లించనుండటంతో లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని స్పష్టం చేశారు.
బీమా పథకం ప్రయోజనాలు
ప్రమాదవశాత్తు మరణం – రూ.5 లక్షలు, శాశ్వత సంపూర్ణ వైకల్యం – రూ.5 లక్షలు, శాశ్వత పాక్షిక వైకల్యం – రూ.2.50 లక్షలు, ప్రమాదవశాత్తు ఆసుపత్రి చికిత్స – గరిష్ఠంగా రూ.25 వేల వరకు ఈ పాలసీ 2026 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చిందని, అర్హులైన ప్రతి నమోదిత మత్స్యకారుడికి నిరంతర బీమా రక్షణ అందేలా మత్స్యశాఖ చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు.మత్స్యకారుల కుటుంబాలకు ప్రమాద సమయంలో అండగా నిలవడం, వారి భవిష్యత్తుకు ఆర్థిక రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులకు సమగ్ర సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.