1
1
రజని వాయిస్ : హైదరాబాద్ ప్రతినిధి
భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉత్తమ ప్రైవేటు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించేందుకు ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ (పీటీఏ) తెలంగాణ రాష్ట్ర కమిటీ సన్నాహాలు చేస్తోంది. ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ మరియు రజని వాయిస్ దినపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో గౌరవ అధ్యక్షులు నోముల మల్లేష్, ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, రజని వాయిస్ దినపత్రిక చీఫ్ ఎడిటర్ పి. బడేసాబ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రజని వాయిస్ దినపత్రిక అసోసియేట్ ఎడిటర్ శంకర్ పోతుగంటి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నోముల మల్లేష్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు సహా వివిధ ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంతో పాటు సమాజ నిర్మాణంలోనూ ప్రైవేటు ఉపాధ్యాయులు విశేషంగా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. వారి ప్రతిభ, సేవలను గుర్తించి గౌరవించడం సమాజ బాధ్యత అని అన్నారు.
సెప్టెంబర్ 6న హైదరాబాద్ రవీంద్రభారతిలో ఉత్తమ ప్రైవేటు ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు తదితర విద్యాసంస్థల్లో పనిచేస్తూ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి, విద్యారంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి ఈ కార్యక్రమంలో సన్మానించనున్నట్లు చెప్పారు.

పీటీఏ రాష్ట్ర అధ్యక్షులు, రజని వాయిస్ దినపత్రిక చీఫ్ ఎడిటర్ పి. బడేసాబ్ మాట్లాడుతూ ప్రైవేటు విద్యారంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారి హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయడం అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడికి సముచిత గౌరవం, గుర్తింపు లభించేలా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
పీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రజని వాయిస్ దినపత్రిక అసోసియేట్ ఎడిటర్ శంకర్ పోతుగంటి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయుల సేవలను సమాజం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయుల ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా విద్యారంగంలో మరింత సానుకూల వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సన్మానించడం వారికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని అన్నారు.
ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, వారి హక్కులు, సంక్షేమం కోసం పీటీఏ నిరంతరం పనిచేస్తుందని శంకర్ పోతుగంటి తెలిపారు. రజని వాయిస్ దినపత్రిక కూడా విద్యారంగానికి సంబంధించిన సానుకూల కార్యక్రమాలకు, ప్రతిభావంతులైన ఉపాధ్యాయుల సేవలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.
ఈ సన్మాన కార్యక్రమానికి ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు తదితర విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, విద్యాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.